ఇన్ స్క్రిప్ట్ ఎందుకు?
ఇన్ స్క్రిప్ట్ ( ఇండియన్ స్క్రిప్ట్ ) కీబోర్డు లేఅవుట్ ను 1986 లో డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్,( DOE ) భారత ప్రభుత్వము వారు కంప్యూటర్లలో బ్రాహ్మీ లిపి ఆధారిత లిపులను ( తెలుగు, తమిళము, కన్నడము, మళయాళము, ఒరియా, బెంగాళీ, అస్సామీ, గుజరాతీ, గురుముఖి (పంజాబీ), దేవనగరి (హిందీ, మరాఠీ, సంస్కృతం)), కలిగిన భారతీయ భాషలలో రాయడానికి ఒక స్టాండర్డ్ కీబోర్డు లేఅవుట్ గా నిర్ణయించారు. అంతకు ముందు టైపురైటర్ల కాలంలో భారతీయ భాషలన్నింటికి ఒక స్టాండర్డ్ కీబోర్డు లేఅవుట్ అనేది లేదు. వివిధ టైపురైటర్ మెషిన్ తయారీదారులు వివిధ కీబోర్డు లేఅవుట్లను పాటించేవారు. తద్వారా టైపరైటర్ కీబోర్డు లేఅవుట్లు కూడా మారుతూ వచ్చాయి.
టైపురైటర్ కీబోర్డు లేఅవుట్లతో ఏమాత్రం సంబంధం లేకుండా, కంప్యూటర్లలో భారతీయ భాషలను రాయడానికి ప్రత్యేకంగా రూపొందించిన కీబోర్డు లేఅవుటు, ఇన్ స్క్రిప్ట్. మాట్లాడుతున్నట్లే రాసే భాషలు మనవి. మాటతో సరిజోడుగాసాగే అక్షరాలు మనవి. అందుకే మన ఆక్షరమాల అల్లికలో ఓ లాజిక్ ఉంది. ఇన్ స్క్రిప్ట్ ఆ లాజిక్ నే ఫాలో అయ్యింది. అచ్చులు, వాటి గుణింతాలను కీబోర్డులో ఎడమవైపున, హల్లులను కీబోర్డులో కుడివైపున, మధ్యవరుసలో మన మాటల వెల్లువలో అధికంగా విన్పించే అక్షరాలను అమర్చి, వాటి ఒత్తక్షరాలను వాటిపైనే, పైవరుసలోనే అమర్చి, రాసేటప్పుడు అధిక వేగాన్ని సాధించడానికి అనుగుణంగా ఈ ఇన్ స్క్రిప్ట్ ను రూపొందించారు. కుడివైపునగల హల్లులపై వచ్చే గుణింతాలు ఎడమవైపున ఉండడం, హల్లుల ద్విత్వ, సంయుక్తాక్షరాల్లో అంతర్లీణంగా వచ్చే పొల్లుకూడా ఎడమవైపున మధ్య వరుసలో ఉండడంద్వారా, రాసేటప్పుడు సవ్యసాచిలా రెండుచేతులనుపయోగించి అతి సులభంగా అధిక వేగాన్ని సాధించగలిగే అవకాశం ఈ ఇన్ స్క్రిప్ట్ కీబోర్డు లేఅవుట్ లోనే ఉన్నది. ఒకింత సాదన తర్వాత నిమిషానికి 40 నుండి 60 పదముల వేగంతో అతిసులువుగా రాయగలుగుతాము.
అందుకే బ్రహ్మీ లిపి ఆధారిత లిపులను కలిగిన భారతీయ భాషలలో, కంప్యూటర్లో రాయడాన్ని అతిసులభంగా నేర్చుకోవడానికి మరియు అధిక వేగంతో రాయడానికి అనుగుణమైన కీబోర్డులేఅవుట్ ఈ ఇన్ స్క్రిప్ట్ ఒక్కటే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
మరిన్ని వివరాలకు,ఇన్ స్క్రిప్ట్ రాచబాట ఉండగా, ఇంగ్లీష్ ఫొనెటిక్ గతుకుల రోడ్డెందుకు? చదవండి.