తెలుగుకు ఆంగ్లలిపి సంకెళ్లు ఎందుకు?
లిపిలేని భాషలు తమ వ్యక్తిత్వాన్ని కోల్పోయి, ఇతర భాషల్లో విలీనమైపోయి క్రమంగా కనుమరుగై పోతాయి అనేది అనుభవ సత్యం. రెండువేల సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగు భాష, చందమామలాంటి అందమైన అక్షరాల తెలుగు భాష, తేనె తీయదనాన్ని మరిపించే తెలుగు భాష, మన అమ్మ భాష, అలా కనుమరుగైపోవడం జరుగకూడదు.
తెలుగు టైపింగ్ రాకపోవడం ద్వార, తెలుగు టైపింగ్ నేర్పే సాప్ట్వేర్ లు కూడా లేకపోవడం ద్వారా, ఇంటర్నెట్ పైన మొదట ఆంగ్ల అక్షరాలనుపయోగించి తెలుగును రాయడానికి అలవాటుపడ్డారు చాలామంది. పద్మ, బరహ, లేఖిని లాంటి ట్రాన్స్ లిటరేషన్ టూల్స్ ( ఆంగ్లంలో రాస్తే తెలుగులో అచ్చయ్యే పరికరాలు ) వచ్చాక చాలామంది వీటి ద్వార తెలుగులో రాయడానికి అలవాటుపడ్డారు.
తెలుగును ఆంగ్ల భాషలో రాయడంలోనూ, ఫొనెటిక్ కీబోర్డు లేఅవుట్ ను ఉపయోగించడంలోనూ, ట్రాన్స్ లిటరేషన్ టూల్స్ నుపయోగించి రాయడంలోనూ ఇబ్బందులు ఉన్నాయి. తెలుగును తెలుగులో రాసే పద్ధతికి దూరమవుతున్నామా, అనే భావన మొదటి ఇబ్బంది అయితే, ఎక్కువ కీ ప్రెస్సులు అవసరం కావడం మరో ఇబ్బంది. తెలుగును ఆంగ్ల భాషలో రాసేపద్ధతికి, ఫొనెటిక్ కీబోర్డు లేఅవుట్ కు, ట్రాన్స్ లిటరేషన్ టూల్స్ కు స్వస్థిచెప్పడానికి, ఇన్ స్క్రిప్ట్ కీబోర్డు లేఅవుట్ లో తెలుగు టైపింగ్ నేర్చుకోవడమే సరైన దారి.
కాలం చెల్లిన తెలుగు టైప్ రైటర్లతోబాటే “తెలుగు టైపింగ్ క్లిష్టమైనది” అనే భావననూ వదిలించుకొని, ఇంపైన ఇన్ స్క్రిప్ట్ ను అలవర్చుకోవడం ఎంతైనా అవసరం. అప్పుడే ఆంగ్లభాషలో ఎంత వేగంగా రాయగలమో అంతకన్నా వేగంగా తెలుగులో రాయగలుగుతాము. మన ఆలోచనల వేగంతో రాయగలిగే అవకాశం ఉంటే అంతకన్నా కావల్సిందేముంది. మన ఆలోచనలకు అంతరాయం లేని వేగం ఇన్ స్క్రిప్ట్ తోనే సాధ్యం. ఇంత చక్కని ఇన్ స్క్రిప్ట్ ఉండగా, ఇంకా తెలుగుకు ఆంగ్లలిపి సంకెళ్లు ఎందుకు? తెలుగును తెలుగులో రాసే పద్ధతికి దూరమవ్వాల్సిన కర్మ మనకెందుకు. తెలుగును తెలుగులోనే రాద్దాము.
మరిన్ని వివరాలకు, ఇన్ స్క్రిప్ట్ రాచబాట ఉండగా, ఇంగ్లీష్ ఫొనెటిక్ గతుకుల రోడ్డెందుకు? చదవండి.